కర్నూలు, ఆంధ్రప్రదేశ్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సామాన్య ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని కర్నూలు జిల్లా మేధావుల కన్షర్టీయం ప్రతినిధులు మండిపడ్డారు. ఆదివారం రాత్రి పింగళి సూరన తెలుగు తోటలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో "మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం" పేరు మార్పు ప్రయత్నాలు, కేంద్ర సాహిత్య అకాడమీ తీరుపై వక్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అధ్యక్షులు ఆచార్య యస్ మన్సూర్ రహమాన్, గాడి చర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కూర సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
చట్టం కావాలి.. స్కీమ్ కాదు: కే వీ నారాయణ
ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధమైన హక్కు నుండి కేవలం ఒక పథకంగా (Scheme) మార్చే కుట్ర జరుగుతోందని నాయకులు కే వీ నారాయణ ఆరోపించారు. "ప్రభుత్వం చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోంది. పేదల హక్కుల కోసం ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచి పథకాన్ని కాపాడుకుంటాం" అని ఆయన హెచ్చరించారు.
స్వయంప్రతిపత్తి కోల్పోతున్న సాహిత్య అకాడమీ: కల్కూర & కెంగార మోహన్
సాహిత్య అకాడమీ ఈ ఏడాది అవార్డులు ప్రకటించకుండా కేంద్రానికి సిఫారసు చేయడంపై చంద్రశేఖర్ కల్కూర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అకాడమీ అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని అన్నారు.
సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ వంటి సంస్థల మాదిరిగానే కేంద్రం సాహిత్య అకాడమీని కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఈ సంస్థలు స్వయంప్రతిపత్తి కలిగినవా లేక బీజేపీ అనుబంధ సంస్థలా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
కలెక్టరేట్ వద్ద నిరసనకు పిలుపు
ఏపీడబ్ల్యూ జెఎఫ్ రాష్ట్ర నాయకులు బి. గోరంట్లప్ప మాట్లాడుతూ, ఈ అంశాలపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించి జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. పేర్ల మార్పు వల్ల ప్రజలకు వచ్చే లాభం లేదని, వ్యవస్థలను తమ గుప్పిట్లో ఉంచుకునే వైఖరి దుర్మార్గమని రాయలసీమ ప్రచురణల ప్రతినిధి మారుతీ పౌరోహితం అన్నారు.
పాల్గొన్న ఇతర ప్రముఖులు: ఈ చర్చాగోష్టిలో గ్రంథాలయ మాజీ చైర్మన్ గంగాధర్ రెడ్డి, పౌర హక్కుల సంఘం నాయకులు పుల్లారెడ్డి, విరసం నాయకులు నాగేశ్వర చారి, రచయిత ఇనాయతుల్లా, ఇమ్మానియేలు, ఎస్.డి.వి అజీజ్, జె.ఎస్.ఆర్.కె శర్మ తదితర మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


Comments
Post a Comment
For suggestions / doubts / complaints