విశ్వ వీధిలో తెలుగే వినిపిద్దాం..!!

 *విశ్వ వీధిలో తెలుగే వినిపిద్దాం..!!*


గుండ్రంగా తిరిగే భూమిలో 

గుండ్రటి అక్షరమే తెలుగు 

విశ్వంలో వెలిగే సూర్యుడే 

తెలుగై ప్రకాశించే నేలపై…!!


నిండు పౌర్ణమి వెన్నెల్లో 

పరవశించిన అక్షరం 

ప్రపంచంలోని భావాలన్నీ 

ముంగిట ఉంచిన కిరణం..!!


అంతరంగపు ఉద్వేగం 

ఆనందపు నింగిలో 

నేలపై అలికిన రంగవల్లి 

వర్ణమాలే సౌందర్యపు లిపి..!!


సరళతకు సాకారం 

ప్రజల మమకారం 

నలు దిక్కుల వ్యాపించి 

కావ్యమై కనిపించింది…!!


జానపదుని ,గుండెల్లో జల్లుమని 

నాగరికుని నోట నవ్యమై 

ప్రజల భాషగా పరవశించి 

పద్య గద్యాలలో పరవళ్ళు తొక్కింది..!!


నన్నయ్య పిలిచి 

పెద్దన్నకు చెప్పి 

పోతన్నతో సంభాషించి 

సుందర కన్యల నడకలు నేర్చింది..!!


సీస పద్యంలో రాజసం 

కందంలో అందలం 

శార్దూలంలో గంభీర్యం

పద్యమాధుర్యాన్ని పంచింది..!!


వీరేశం విజ్ఞానపు దారులు 

గురజాడ నవ్య కవితలు

గిడుగు సరళత పదాలు 

వాడుకలో వైభవాన్ని పెంచింది..!!


విశ్వనాథ రామాయణ కల్పవృక్షం

సినారే విశ్వంభర కావ్యం 

రావూరి పాకుడురాళ్లు గ్రంథం 

తెలుగు శిఖలో జ్ఞానపీఠలై నిలిచాయి..!!


తెలుగే మన శ్వాస 

తెలుగే మన భాష 

తెలుగే మన వెలుగు 

విశ్వవీధిలో తెలుగే వినిపిద్దాం..!!


*కొప్పుల ప్రసాద్ 🖊️*

నంద్యాల 

9885066235

Comments